Tuesday, 21 August 2012

గతుకుల ప్రయాణం

సాఫీగా సాగుతున్నప్పుడు ఏమీ గుర్తుకు రావు.
గతుకుల ప్రయాణం మొదలైనపుడే గతం గిర్రున తిరుగుతుంది.


Saturday, 11 August 2012

లేకపోతే మనిసికి గొడ్డుకి తేడా ఏటుంటాది

ఏవో చెత్త ఆలోచనలు  నా మెదడు చుట్టూ ముసురుకుంటున్నాయి. వాటిని తరిమేయలేక. కీ బోర్డుపై చేతులు కదుపుతున్నాను. అయినా నెగిటివ్ ఆలోచనలు వీడడం లేదు. పాజిటవ్ గా ఉండడమెలా అంటూ చాలా పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాల సారాంశం ఎందుకో వర్కవుట్ అవ్వడం లేదు. ట్రై చేస్తున్నా. వాటి మేజిక్ పనిచేయాలంటే ఇంకో రోజు గడవాలేమో. అయినా కాలం వివిధ సందర్భాల్లో మన మీద వేసే ముద్రల్ని పుస్తకాలతో చెరిపేద్దామనుకోవడం పారపాటేమో. ఏడ్వాలనుకున్నప్పుడు ఏడుస్తాం గానీ  నవ్వలేం. నవ్వాలనుకున్నప్పుడు  ఎంత గింజుకున్నా ఏడుపురాదు.  కష్టమొస్తే బాధపడాలి  ఆనందం వస్తే గంతులేయాలి.  పుస్తకాలు చదివాం కాబట్టి ఏడుపొచ్చినప్పడు నవ్వమంటే  నవ్వలేం. పిరికితనం ఆవహించిన వేళ ధైర్యంగానూ  ఉండలేం. తప్పదు కొన్ని నిమిషాలైనా,  కొన్ని క్షణాలైనా,  భావోద్వేగాలు మనతో బాస్కెట్బాల్ ఆడుకుంటాయి.  లేకపోతే  ముత్యాల ముగ్గులో రావుగోపాల్రావన్నట్లు మనిసికి గొడ్డుకి తేడా ఏముంటుంది.

కట్టూ కాపీ... జకారియా

కట్టూ కాపీ చేశాడు. కంట్రోల్ డిలీట్ కొట్టారు.
పాపం ఫరీద్ జకారియా. కాపీ కొట్టినందుకు టైమ్స్ నెట్ వర్క్  అతణ్ని డిబారు చేసింది.   ఏప్రిల్లో జకారియా ఓ ఆర్టికల్ రాశాడు. అందులో  కొన్ని పేరాలు అంతకుముందు న్యూయార్కర్లో  వచ్చిన ఓ వ్యాసంలోనివట. ఈ మక్కీకి మక్కీ కాపీ యవ్వారాన్ని ఒక బ్లాగరు వెలుగులోకి తెచ్చారు. ఆ వెలుగు దావానాలంగా మారి.. వయా పేస్ బుక్కు, ట్వీటర్లాంటి సామాజిక సైట్ల గుండా సంచరించి జకారియా ఉద్యోగానికి స్పాట్  పెట్టింది.

అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో గొప్ప జర్నలిస్టుల్లో ఒకరిగా  జకారియాకు పేరుంది. అమెరికాలో ప్రభావశీలమైన వ్యక్తుల్లో అతను ఒకరు. 2010లో టైమ్స్ మ్యాగజైనుకి ఎడిటరుగా కూడా అతను పనిచేసినట్టుంది. అలాంటి వ్యక్తి .. వేరే వ్యాసం నుంచి పేరాలకి, పేరాలు సంగ్రహించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. జరిగిన దానికి వెంటనే  జకారియా క్షమాపణ చెప్పి..  పొరపాటైందని లెంపలేసుకున్నా..  టైమ్ కనికరించలేదు. దొబ్బేయ్ అంది. కట్టూ పేస్తూ చేస్తే ఇంత ఉద్యోగం ఫట్టైపోతుందని ఊహించలేదు జకారియా. ఇంతకుముందు కూడా జకారియాపై ఇలాంటి ఆరోపణలొచ్చాయి. 

ఇక అమెరికా నుంచి ఆంధ్రప్రదేశానికి వద్దాం. మన దగ్గరా జకారియాలున్నారు. కట్టూ కాపీ కాకపోయినా, ఇంటర్నెట్లో వచ్చిన వ్యాసాలను అనువాదం చేసి.. అవి తమ సొంత స్రుజనగా చెప్పుకునేవాళ్లు చానా మంది ఉన్నారు.
అంతెందుకు బ్లాగుల్లో రాసిన విషయాలను ఆ బ్లాగరును సంప్రదించకుండా వాడిన సందర్భాలు కోకొల్లలు. అయినా జకారియాలా ఎవరికీ పదవులు పోవు. దటీజ్ ఇండియా.

ఊకొడతారా, ఉత్తిదే అంటారా

కొందరికి కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను దాటి పనిచేయరు. దాటాలంటే  భయం. అందుకే  జీవితమంతా ఆ పరిమితుల్లోపే గడిపేస్తారు. ఇంకొందరుంటారు.వీరికీ పరిమితులుంటాయి. కాని వీరు తమ పరిమితులను తామే నిర్దేశించుకుంటారు. వాటి పరిథిని కూడా తమకు ఇష్టమొచ్చిన రీతిలో మార్చుకుంటూ ఉంటారు.  వీరికి భయముండదు. రేపటి గురించి ఆలోచనా ఉండదు. ముందుకు దూసుకుపోవడమే తెలుసు. కష్టమొస్తే ఓర్చుకునే మానసిక శక్తి, ఆనందమొస్తే ఆస్వాదించే గుణముంటాయి వీరిలో. ఇలాంటి వాళ్లే జీవితంలో విజయవంతమవుతారు. పరిమితుల చట్రంలో సంచరించేవాళ్లు, వారెంత మేధావులైనా సరే, విజయానికి ఆమడదూరంలోనే నిలిచిపోతారు.

ఇది ఒక మిత్రుడి చెప్పిన సుభాషితం

ఏకీభవించాలా.. వద్దా.. ఎందుకో మిత్రుడి చెప్పిన మాటల్లో ఎన్నో ప్రశ్నలు కనిపించాయి నాకు, మరి మీకో