Monday 17 December 2012

గిరీశాన్ని జైల్లో పెట్టాలి.. ఇట్లు గుమ్మడికాయ దొంగలు

నిజం చెబితే నిష్టూరమాడతారు.  కట్జూపైనా అలానే నిష్టూరమాడారు  చాలామంది. అయినా  వెధవ, సన్నాసంటే  ఎవరికైనా మంట పుట్టడం సహజం. అందుకే  మంట పుట్టినోళ్లంతా ఎంత మాట, ఎంత మాటంటూ  కారాలూ మిరియాలూ,  ఆవాలూ జీలకర్ర , ఇలా ఏది దొరికితే అది నూరేశారు కట్టూపైన. అంతగా మంట పుట్టనివాళ్లు మాత్రం, కట్టూ చెప్పిన  శాతానికి  వెంట్రుకలు పీకారు. ఉంటే గింటే  60, 70 శాతముంటారేమో కానీ.. మరీ 90 శాతముండరనీ.  కావాలంటే 2001 జనాభా లెక్కలు ఓసారి తిరిగేయాలని కట్టూ గారికి సూచించారు. గుమ్మడికాయ దొంగలు మాత్రం ఊరుకోలేదు. తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఓ పక్క భుజాలు తడుముకుంటూనే మరోవైపు  కట్జూని  కఠినంగా శిక్షించాల్సిందేనంటూ కోర్టు తలుపులు దబదబా బాదేరు.  నిజమే గుమ్మడికాయల దొంగలు చెబుతున్నట్లు కట్టూని శిక్షించాల్సిందే.  ఐతే అంతకుముందు ఇంకో వ్యక్తినీ  శిక్షించాలి. ఆ వ్యక్తి పేరు గిరీశం. అవును కన్యాశుల్కంలోని గిరీశమే. ఎందుకంటే కట్టూ గారు తిట్టింది తాజాగానే.  కానీ వంద సంవత్సరాల క్రితమే  ‘మన వాళ్లు వఠ్ఠి వెథవాయిలోయ్’ అని కన్యాశుల్కంలో  గిరీశం తేల్చేశాడు. పైగా  కట్టూలా పదిశాతం డిస్కౌంటూ ఇవ్వలేదు. సో గిరీశం గారూ.. ఎక్కడున్నా వెంటనే లగెత్తుకొని రండి. మధురవాణి దగ్గరున్నాను, ఛార్జీలకు కాపర్స్ తక్కువయ్యాయి.. అంటే కుదరదు. మీ శిష్యుడు వెంకటేశం దగ్గర అప్పు తీసుకునైనా  రావాలి. ఇది గుమ్మడికాయ దొంగల డిమాండు.


2 comments:

  1. చాలా బాగుంది..

    ReplyDelete
  2. ఏ వెధవనైనా వెధవ అని తిడితే, తిడితే తిట్టాడులే ఉన్న మాటే కదా అన్నాడు అని సరిపెట్టుకునేట్లయితే వాడు వెధవ ఎ౦దుకు అవుతాడు. అ౦దుకనే ఆ బాపతు వాళ్ళెవరో ఉడుకుమోత్తన౦తో కోర్టుకు వెళ్తే మీరేమో కట్జూ గారి ప్రాణానికి గిరీశాన్ని అడ్డేశారు. కట్జూ గారిని శిక్షి౦చాల్సివస్తే గిరీశాన్ని కూడా లోపల వెయ్యాల్సి౦దే

    ReplyDelete